ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, ముఖ్యంగా రజక వర్గానికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించడంతో పాటు రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి. సావిత్రి తెలిపారు.
జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజక సంఘ నాయకులతో కలసి పాల్గొని ఆమె మాట్లాడుతూ, రజక కుటుంబాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రజక కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి విజయనగరంలో 51 వేల మంది రజక జనాభా ఉన్నట్లు చైర్పర్సన్ తెలిపారు.
సొసైటీల ద్వారా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ నుంచి మొత్తం రూ.698.72 లక్షల లబ్ధి అందిందని తెలిపారు. ఇందులో 429 రజక సొసైటీలు ఉండగా, వాటికి రూ.147.25 లక్షల ఆర్థిక సహాయం అందినట్లు వెల్లడించారు. రజక మహిళలు శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు టైలరింగ్‌తో పాటు వివిధ జీవనోపాధి శిక్షణలు అందించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 2,849 దరఖాస్తులు రాగా, 2,063 మంది అర్హత పొందినట్లు తెలిపారు. అయితే రజక మహిళల నుంచి కేవలం 81 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని, వారిలో 32 మంది శిక్షణ పొందారని వివరించారు. అవగాహన లోపం కారణంగా రజక మహిళలు ప్రభుత్వ శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొంటూ, భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
రజకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి, రజక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు. గతంలో త్రీమెన్ కమిషన్ ఏర్పాటు చేసి, దాని కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించి మూడు నెలల పాటు కమిషన్ పనిచేసినప్పటికీ, తదనంతర పరిణామాల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని కూడా రజక సంఘ నాయకులు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
DNT అంశంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రజకులను డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (DNT) కేటగిరీలో చేర్చడం ద్వారా విద్య, వైద్యం, ఇతర అవకాశాల్లో మద్దతు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్పర్సన్ తెలిపారు.
రజకుల అభ్యున్నతికి సమన్వయంతో కృషి చేస్తామని, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘ నాయకులు, ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రజక సమాజ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సి. సావిత్రి హామీ ఇచ్చారు. వృత్తిపరమైన అభివృద్ధి, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు అవసరమైన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. "రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. రజక కుటుంబాల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హుడికి అందించడమే మా లక్ష్యం" అని చైర్పర్సన్ సి. సావిత్రి స్పష్టం చేశారు.
