విజయనగరం, సెప్టెంబర్ 28: స్వాతంత్ర ఉద్యమ విప్లవ నాయకుడు సర్దార్ భగత్ సింగ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

మంత్రి క్యాంప్ కార్యాలయం నందు సోమవారం భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టటానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు.

దేశ స్వేచ్ఛ కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన చూపిన దేశభక్తి, ధైర్యం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని అన్నారు.

నేటి తరం యువత భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, దేశ ప్రగతికి మరియు సమాజ సేవకు పునరంకితం కావాలని మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, చెప్పా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.