విజయనగరం, సెప్టెంబర్ 15: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా చూడాలని, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
- మార్చి 2027 నాటికి భూముల రీ-సర్వే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికపై చర్చ
- అక్టోబర్ 2026 నాటికి వంద శాతం పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం
- జీఓ 306, జీఓ 444, జీఓ 445ల అమలుతో పాటు మీభూమి-బ్లాక్‌చెయిన్ విధానం పకడ్బందీగా అమలు
- అర్హులైన లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాల పంపిణీకి ప్రణాళిక
- ఏపీఐఐసీ భూములకు సంబంధించి 22ఏ తొలగింపు, మ్యుటేషన్ అంశాలపై ప్రత్యేక దృష్టి
ఈ సమీక్షా సమావేశంలో హౌస్ ఫర్ ఆల్, భూముల రీ సర్వే దశల వారీ పురోగతితో పాటు మార్చి 2027 నాటికి రీ-సర్వే లక్ష్యాన్ని, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. అక్టోబర్ 2026 నాటికి ఇచ్చిన లక్ష్యం మేరకు వంద శాతం పాస్‌పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని, గత నెలల్లో రీ-సర్వే పాస్‌పుస్తకాలు జారీ చేసిన గ్రామాల్లో ఏమైనా బ్యాక్లాగ్ ఉంటే తక్షణమే క్లియర్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలైన జీఓ 306, జీఓ 444, జీఓ 445ల అమలుతో పాటు మీభూమి-బ్లాక్‌చెయిన్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పెద్ద భూములు మరియు బల్క్ ల్యాండ్ సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించాలని, ఏపీఐఐసీ భూములకు సంబంధించి 22ఏ తొలగింపు మరియు మ్యుటేషన్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
"హౌసింగ్ ఫర్ ఆల్" వెబ్సైట్లో ప్రస్తుత లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి, ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులను గ్రామాల వారీగా గుర్తించి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. అర్హులైన లబ్ధిదారులకు గ్రామాల్లో మూడుసెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలు పంపిణీకి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రస్తుత లేఅవుట్లను సమగ్రంగా పరిశీలించి, పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఇల్లు మంజూరైన లేఅవుట్లలో ఇల్లు కట్టుకోడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారా లేదా వేరే స్థలాన్ని కోరుతున్నారా మొదలగు విషయాలను తెలుసుకోవాలని సూచించారు. డిమాండ్‌కి అనుగుణంగా కొత్త లేఅవుట్లను వేసేందుకు ఎంత స్థలం కావాలో గుర్తించాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, ఐవీఆర్ఎస్-పీపీపీ అలాగే ఓఆర్‌సీఎంఎస్ అంశాలపై సమీక్ష జరిపారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వేపై మండలాల వారీగా సమీక్ష జరిపారు. భూ సేకరణ ప్రతిపాదనలు, ఇతర రెవెన్యూ అంశాలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
