విజయనగరం, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 27 మండలాలు, 449 ఎంపీటీసీ స్థానాలు, 27 జెడ్పీటీసీ స్థానాలు, 1,586 పోలింగ్ కేంద్రాల వివరాలను సమావేశంలో పరిశీలించారు. 2026 ఏప్రిల్ 15న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, వార్డులు, పంచాయతీ, ఎంపీటీసీ స్థానం, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, విద్యుత్, తాగునీరు, షెడ్డు, మరుగుదొడ్లు, సూచిక బోర్డులు, హెల్ప్‌డెస్క్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఒకే ప్రదేశంలో రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల క్యూల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ల జాబితాలు, చెరగని సిరా, పేపర్ సీల్స్, వివిధ ఫారాలు, కవర్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అవసరమైన పోలింగ్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రొక్యూర్‌మెంట్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో బ్యాలెట్ బాక్సుల లభ్యతను పరిశీలించి, వాటికి మరమ్మతులు, ఆయిలింగ్ తదితర పనులు పూర్తి చేయాలని, సుమారు 3,185 బ్యాలెట్ బాక్సులను, చిన్న బాక్సులను కూడా ఆయిలింగ్ చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజున అవసరమైన రిజర్వ్ బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు.

అన్ని పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ముందుగానే తనిఖీ చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసి అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలతో పాటు అవసరమైన చోట పోలీసు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, వారికి శిక్షణ, పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, ర్యాండమైజేషన్ ప్రక్రియలను నిర్ణీత నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు అవసరమని, మొత్తం 1,586 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బంది వివరాలను కూడా సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి రవాణాకు అవసరమైన వాహనాలను సమకూర్చడంతో పాటు మండలాల వారీగా కమ్యూనికేషన్, జోన్లు, రూట్లను సిద్ధం చేయాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎస్‌ఈసీ-ఈఎంఎస్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంసీసీ టీమ్స్, ఎఫ్ఎస్‌టీ టీమ్స్, ఎస్ఎస్‌టీ టీమ్స్, ఆర్వోలు, జోనల్, రూట్ అధికారులను ముందుగానే గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. వీరందరికీ ముందుగానే వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎన్నికల ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.