విజయనగరం, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమలులో అన్ని ప్రభుత్వ శాఖలూ ఏ+ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.

శనివారం తమ ఛాంబర్ నుంచి జిల్లా అధికారులతో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతా సూచికలపై ఆయన సమీక్షించారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్, నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో వివిధ శాఖల పనితీరును మరింత మెరుగుపరచి, నిర్దేశించిన కేపీఐల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌లో నిర్వహించిన కేపీఐలపై సమీక్ష సమావేశంలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, పనితీరు సూచికలపై అధికారులతో చర్చించారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన లక్ష్యాలను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసి, జిల్లాను ఏ+ గ్రేడ్ సాధించే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

ఏ+ గ్రేడ్ సాధించిన కొన్ని శాఖలను కలెక్టర్ అభినందించారు. ఏ+ గ్రేడ్ లేని శాఖల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మెరుగైన సేవలు అందించి వచ్చే నెలకు ఏ+ గ్రేడ్ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.