విజయనగరం, సెప్టెంబర్ 23: ఈ ఖరీఫ్‌లో ఎక్కడా సాగు విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, వరి స్థానంలో ఉద్యాన పంటలు, కూరగాయలు లేదా అపరాలు తదితర పంటల ద్వారా శతశాతం సాగు అయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రైతులను చైతన్యపరిచి, ఉద్యాన పంటలవైపు మళ్లించాలన్నారు. ఎక్కడా పంట లేకుండా భూమిని ఖాళీగా ఉంచకూడదని స్పష్టం చేశారు.

మన జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ఎంతో అనుకూలత ఉందని, దానిని వినియోగించుకోవాలని కోరిన కలెక్టర్, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఖరీఫ్‌కు, రబీకి మధ్య సాగు విస్తీర్ణంలో తేడా ఎక్కువగా ఉంటుందని, వచ్చే రబీలో ఈ తేడాను తగ్గించి, ప్రకృతి సేద్యం ద్వారా ఖరీఫ్‌కు ధీటుగా సాగు జరిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, డ్వామా సహకారంతో ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ఆసక్తి ఉన్న రైతుల ద్వారా పశుగ్రాసాన్ని పండించాలని సూచించారు. దీనికోసం సంబంధిత శాఖల అధికారులు సమావేశం నిర్వహించి ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో బుధవారం ఆన్‌లైన్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖతో పాటు ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక, డీఆర్డీఏ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన విత్తనాల పంపిణీ, ఎరువుల లభ్యత, పంటల సాగు పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఖరీఫ్‌లో లక్షా 41 వేల హెక్టార్లకు గాను, ఇప్పటివరకు సుమారు లక్షా 05 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు అయ్యాయని, మిగిలిన చోట్ల ఉద్యాన పంటలు, అపరాలు, కూరగాయలు, ఆకుకూరలు, జనుము లాంటి పంటలు సాగు చేయాలని, దానికోసం రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. ఈ ఆన్‌లైన్ సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ ఎం. రామారావు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ మన్మథరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, డ్వామా పీడీ శారదాదేవి, ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, అనుబంధ శాఖల అధికారులు, ఆన్‌లైన్ ద్వారా ఏడీఏలు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.