విజయనగరం, సెప్టెంబర్ 28: విజయనగరం జిల్లాలోని భీమసింగిలో గల శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న జీతాలు, VRS బకాయిల చెల్లింపు కోసం రూ.9.12 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఫ్యాక్టరీ పరిష్కారం వెనుక కార్మికులు, వాటాదారులు, ఉద్యోగుల కోరిక, స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టుదల ఉంది.

గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ముందు భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు, కార్మికులు, వాటాదారులు, ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. "అయ్యా.. గత ప్రభుత్వ హయాంలో నష్టాల పేరుతో ఫ్యాక్టరీని మూసివేసి 6-7 ఏళ్లుగా జీతాలు, VRS లేకుండా మమ్మల్ని రోడ్డున పడేశారు. దయచేసి మా సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించండి" అంటూ వేడుకున్నారు.

నేడు ఫలించిన మంత్రి కృషి:

మంత్రి కొండపల్లి ప్రస్తావనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే Group of Ministers (GOM) తో సమీక్షించి పరిష్కార మార్గం చూపారు.

GOM సిఫార్సుల మేరకు భీమసింగి ఫ్యాక్టరీకి ఉద్యోగులకు పెండింగ్ జీతాలు, VRS ఎక్స్-గ్రేషియా కోసం రూ.9.12 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫ్యాక్టరీని పారదర్శకంగా లిక్విడేషన్ చేసి, జాయింట్ కలెక్టర్ ను లిక్విడేటర్ గా నియమించి, బ్యాంకు అప్పులను OTS ద్వారా పరిష్కరించడం ద్వారా ఉద్యోగులకు పూర్తి న్యాయం జరగనుంది.

గతంలో తాను సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమస్య నేడు ఫలించిందని, కార్మికులు, వాటాదారుల కోరిక నెరవేరిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో తమ దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైనందుకు స్థానికంగా ఉన్న రైతులు, వాటాదారులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ, చొరవ చూపిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కృషి చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.