'నీలి ఆకాశాల కోసం స్వచ్ఛమైన గాలి' అనే నినాదంతో అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం బీచ్ రోడ్‌లో ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రజల్లో వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భాగంగా కాళీమాత ఆలయం నుంచి ఈ ర్యాలీ సాగింది.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య, పోర్ట్ చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీపీఏ వైస్ ఛైర్‌పర్సన్ రోషణి అపరంజి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుంద రావు, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, జీవీఎంసీ, ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.