విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషేక్ కిషోర్, సీపీ శంకబ్రత బాగ్చి, జేసీ విద్యాధరితో కలిసి మంత్రి ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం మార్చ్‌పాస్ట్‌తో పాటు పోలీసు సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్ల కవాతు ఉత్సాహంగా జరిగింది.

వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమలు, ఏపీఐఐసీ, పాఠశాల విద్య, వైద్యారోగ్యం, పర్యాటకం, రెవెన్యూ, పౌరసరఫరాలు, ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖలు ప్రదర్శించిన శకటాలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించాయి.

వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల కింద 30,366 మంది లబ్ధిదారులకు రూ.397.33 కోట్ల విలువైన ఆస్తులు, ఆర్థిక సహాయాన్ని మంత్రి పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 568 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు అందజేశారు. పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో సభికులను రంజింపజేశారు.