విశాఖపట్నం కేంద్రంగా ఏఐ హబ్‌ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని, డేటా సెంటర్లకు అనుమతుల విషయంలో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలకూ తావు లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో ఈ వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు.

డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, నగర ప్రజల తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.