భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అమలు కావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణారావు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగానే సంక్షేమ బోర్డు ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ బోర్డులో రూ.5,000 కోట్లు ఉన్నాయని, ఈ నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని అన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులు చనిపోయినా, ప్రమాదానికి గురైనా, అంగవైకల్యం చెందినా, కార్మికుల పిల్లలకు వివాహాలు జరిగినా, డెలివరీలు అయినా, స్కాలర్షిప్లు వంటి ఏ ప్రయోజనాలూ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కార్డులను రెన్యువల్ చేయడంలో లేబర్ అధికారులు తీవ్ర తాత్సారం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
నిరసనలకు పిలుపు: వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీసు వద్ద, అక్టోబర్ 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులతో భారీ నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని రమణారావు తెలిపారు. విశాఖ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.
భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం వసూలు చేస్తున్న సెస్ డబ్బులను ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం సరికాదని, వాటిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని రమణారావు డిమాండ్ చేశారు.
