విశాఖపట్నం, అక్టోబర్ 4 (ఎక్స్ప్రెస్ టుడే): మెరుగైన పాలనతో పాటు పారిశుధ్య నిర్వహణలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డును సింహాచలం దేవస్థానం సాధించిన నేపథ్యంలో, దేవస్థానం ఈఓ వెంకట్రావును విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఈఓ వెంకట్రావుకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఈఓ వెంకట్రావు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఇంజనీరింగ్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ, పారిశుధ్యం, నిర్వహణ, ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేవస్థానాన్ని అనేక విధాలుగా మరింత మెరుగైన స్థాయికి తీర్చిదిద్దారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకోవడం దేవస్థానానికి, సిబ్బందికి గర్వకారణమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఈఓ వెంకట్రావుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
