విశాఖపట్నం (పెందుర్తి), అక్టోబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి, జీవీఎంసీ 77వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోవిరి షణ్ముఖ శివకుమార్‌తో సహా సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్ బాబు, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా పార్టీ నాయకులందరూ కలిసిమెలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు.

పెందుర్తి నియోజకవర్గం, సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శివకుమార్‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వారందరికీ జనసేన కండువాలు వేసిన ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో పాటు గతంలో తనతో ఉన్న అనుబంధంతో శివకుమార్ జనసేనలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపన, చురుకుదనం గల శివకుమార్ చేరికతో 77వ వార్డులో పార్టీ బలం మరింత పెరిగిందని తెలిపారు.

వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ తప్పనిసరిగా గెలిచేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. సీట్ల కేటాయింపు అధినేత మాత్రమే చేస్తారని, ఎవరికి సీటు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. పార్టీలోని నాయకులందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో నూరు శాతం విజయాలు నమోదు చేసి, పార్టీకి, వ్యక్తిగతంగా తనకు మంచి పేరు తీసుకురావాలని జనసైనికులకు మార్గనిర్దేశం చేశారు.

జనసేన కండువా కప్పుకున్న ముఖ్యులలో అప్పికొండ శివాలయం మాజీ చైర్మన్ గంగరాజు, సీనియర్ నాయకురాలు షేక్ రేష్మ బేగం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేవాడ బూత్ కన్వీనర్ కూర్మా అప్పారావు, రషీద్, మోస, కాసు కుమార్, జయరామ్, మాజీ శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు సోమ నాయుడు, కమల్ హాసన్, మహేష్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించిన ఎమ్మెల్యే రమేశ్ బాబు, మంచి రోజు కావడంతో ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.