విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ఎంఎస్ఎమ్ఈల బలోపేతానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం విశాఖ కన్వెన్షన్లో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ డే డెవలప్మెంట్ ప్రోగ్రాంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
- సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల్లోనే ఎంఎస్ఎమ్ఈల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారని మంత్రి వెల్లడి
- రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు
- ఎంఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి కోసం అన్ని శాఖలతో సమన్వయంతో ప్రభుత్వం కృషి
- ఎంఎస్ఎమ్ఈలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఎంఓయూలు కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఎంఎస్ఎమ్ఈ పార్కుల ద్వారా యువనేత మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఎంఎస్ఎమ్ఈల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారన్నారు. ఎంఎస్ఎమ్ఈలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి ఎంఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
ఎంఎస్ఎమ్ఈలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎంఓయూలు కుదుర్చుతుందని మంత్రి తెలిపారు. ఎంఎస్ఎమ్ఈ ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, ఎంఎస్ఎమ్ఈ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపవర్మెంట్ క్రియేట్ అవుతోందని పేర్కొన్నారు.
ఎంఎస్ఎమ్ఈ పార్కుల ద్వారా ఎన్నికలకు ముందు యువనేత మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా క్రియేట్ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
