విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయం — మంత్రి గొట్టిపాటి రవికుమార్
విశాఖపట్నం, అక్టోబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, రామకృష్ణ, విద్యుత్ సంస్థల సీఎండీలతో కలిసి కారుణ్య నియామకాల కింద ఎంపికైన 43 మంది బాధితుల కుటుంబ సభ్యులకు సోమవారం నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ విధంగా 450 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు ప్రజా సానుకూలత పెరిగేలా, ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని కోరారు.
ప్రజలపై నయాపైసా భారం లేకుండా...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విద్యుత్ శాఖ ద్వారా ప్రజలపై నయాపైసా భారం మోపకుండా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి విద్యుత్ చార్జీలు పెంచి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎల్ నినో వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, డిపార్ట్మెంట్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.
శాఖ అవసరాలను గుర్తించి, త్వరలోనే 629 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 7,000 మందికి పైగా డిస్కంలలోకి అధికారికంగా తీసుకున్నామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ పథకం అమలు, పీఎం సూర్య ఘర్ సోలార్ పథకం విస్తరణ, భూగర్భ కేబులింగ్ పనులు, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల అనుసంధానం తదితర పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ రంగంలో దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు పటిష్ట చర్యలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు.
ఎంపీ భరత్ మాట్లాడుతూ, కారుణ్య నియామకాలు పొందిన ఉద్యోగులు తమ వృత్తికి, కుటుంబానికి న్యాయం చేయాలని హితవు పలికారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎనర్జీ కమిటీ సభ్యునిగా ఉన్నానని, రానున్న రెండేళ్లు విద్యుత్ నిర్వహణపైనే దృష్టి పెడతానని అన్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాలు
ఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృథ్వీ తేజ్ మాట్లాడుతూ, ఈపీడీసీఎల్ పరిధి 12 జిల్లాల్లో విస్తరించి ఉందని, సుమారు 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యం బారిన పడిన వారి కుటుంబాలకు 2024లో 37 మందికి, 2025లో 77 మందికి, ఈ ఏడాది 43 మందికి కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు. శాఖలో అత్యంత రిస్క్ గల ఉద్యోగాలు ఉన్నందున మరణాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయని, బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరుగుతోందని తెలిపారు.
గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. హుద్‌హుద్ సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ, ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ కేబ్లింగ్ జరుగుతోందని, దానిని వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
