విశాఖపట్నం, సెప్టెంబర్ 21: కలెక్టరేట్లో సోమవారం ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ.. గురజాడ వెంకట అప్పారావు భావితరాలకు స్ఫూర్తిదాత అని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక అసమానతలు, మూఢ నమ్మకాలు, అన్యాయాలను తన రచనల ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో గురజాడ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన రచనలు సమాజాన్ని ఆలోచింపజేసేలా, మార్పు వైపు నడిపించేలా ఉన్నాయన్నారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సందేశం నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందన్నారు. ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులను తన రచనల్లో ప్రతిబింబిస్తూ సమాజ సంస్కరణకు కృషి చేసిన మహనీయుడిగా గురజాడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
గురజాడ రచనలు తన వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ప్రభావం చూపాయని డీఆర్వో గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎదుగుదలకు, సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి గురజాడ రచనలు దోహదం చేశాయన్నారు. నేటి యువత గురజాడ సాహిత్యాన్ని చదివి, ఆయన ఆశయాలను అర్థం చేసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
