దివ్యాంగుల స్వతంత్ర జీవనం, స్వయం సమృద్ధి, ఆత్మనిర్భరతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత త్రిచక్ర మోటార్ వాహనాలను జిల్లాలోని 51 మంది దివ్యాంగులకు సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు.
ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ దివ్యాంగులకు స్వయం సమృద్ధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఒక్కో వాహనం సుమారు రూ.1.02 లక్షల విలువ కలిగి ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 60 వాహనాలు మంజూరు కాగా, ప్రస్తుతం 51 మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉంటే విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులను లేదా స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులు ఎవరైనా మిగిలి ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి కూడా త్రిచక్ర మోటార్ వాహనాలు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దివ్యాంగులు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దివ్యాంగుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,750 మోటార్ స్కూటీలను దివ్యాంగులకు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్ల కేటాయింపు, సుమారు 370 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో మూడు చక్రాల మోటార్ వాహనాలను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. 2025-26 సంవత్సరానికి విశాఖ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 60 వాహనాలు మంజూరు కాగా, 79 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అర్హత కలిగిన 51 మందిని జిల్లా ఎంపిక కమిటీ ఎంపిక చేసిందన్నారు.
