విశాఖపట్నం, ఆగస్టు 28: పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 58వ వార్డులో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

  • కోరమాండల్ రిక్రియేషన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా పాల్గొని సైకిళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
  • 8వ నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 103 మంది విద్యార్థినులకు లబ్ధి
  • శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, మిండి, నడుపూరు ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు సైకిళ్లు

జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుతూ తమ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సుమారు 103 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను అందించారు. వారిలో శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, మిండి, నడుపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు బాలికల్లో ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా మహిళలు, విద్యార్థులు, సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికి నిరంతరం తోడ్పాటును అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కోరమాండల్ ఉద్యోగిని అఖిలశ్రీ కలెక్టర్ చేతికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.