విజయవాడ, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు.
ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు ఆ డ్రోన్‌పై సంతకం చేశారు. వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణలను కూడా ఆయన పరిశీలించారు.
పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను గంటల్లో ఈవీలుగా కన్వర్ట్ చేసే సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. సాధారణ వాహనాలను ఈవీలుగా మార్చే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖాన్ని స్కాన్ చేసి హెల్త్ రిపోర్టు ఇచ్చే యాప్‌ను తయారు చేసిన సంస్థ స్టాల్‌ను కూడా సీఎం సందర్శించారు. నిమిషాల వ్యవధిలో ప్రాథమిక రిపోర్టు ఇవ్వగలమని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
స్వర్ణాంధ్ర–10 సూత్రాల అమలులో టెక్నాలజీని వినియోగించి సమర్థవంతంగా అమలు చేసే అంశంపై తమ ఐడియాలను చిన్నారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ ప్రజెంట్ చేశారు.
