దేశంలోనే మొదటి కృత్రిమ మేధ (ఏఐ) నగరాన్ని లఖ్‌నవూలో అభివృద్ధి చేసేందుకు పనులు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తెలిపారు.

హెచ్‌సీఎల్ ఐటీ సిటీ లఖ్‌నవూ రెండో దశ విస్తరణను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లఖ్‌నవూను దేశంలోని ప్రముఖ ఏఐ ఆవిష్కరణ నగరాల్లో ఒకటిగా నిలపడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఈ దిశగా హెచ్‌సీఎల్‌కు ప్రతిపాదన కూడా చేశామన్నారు.

లఖ్‌నవూలో కనీసం 50 ప్రపంచ స్థాయి ఏఐ స్టార్టప్‌లను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేసి ప్రపంచ మార్కెట్లకు చేర్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి భూమి గొప్ప బలమైతే, దేశంలోనే అత్యంత యువ శ్రామిక శక్తి కూడా ఉత్తరప్రదేశ్ బలమని, ఈ కార్యక్రమంలో చేరాలని యువ నిపుణులను కోరారు.

రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రెండో దశ విస్తరణతో లఖ్‌నవూలో సుమారు 6,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఐదుగురు లబ్ధిదారులను ముఖ్యమంత్రి సత్కరించారు. యూపీ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావడం హెచ్‌సీఎల్ గ్రూప్‌కు గర్వకారణమని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.