భక్తుల సేవల్లో సాంకేతికత, పారదర్శకత, వ్యవస్థీకరణకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తిరుమలలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం తిరుమలకు 10 వేల నుంచి 14 వేల వరకు వాహనాలు వస్తున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. దాతల సహకారంతో మరో 37 ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని, రాబోయే బ్రహ్మోత్సవాలకు సుమారు 25 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

టీటీడీ సాధిస్తున్న విజయాలు ఏ ఒక్క వ్యక్తివి కావని, ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతున్నాయని ఈవో స్పష్టం చేశారు. ఉద్యోగుల మధ్య చర్చ, అభిప్రాయ భేదాలను వ్యక్తిగతంగా కాకుండా సమస్యా పరిష్కారానికి ఉపయోగించుకోవాలని, ప్రజల అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరించి పరిష్కరించాలని సూచించారు.