22ఏ నిషేధిత భూముల జాబితా అంశంలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన సమాధానంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
- 22ఏ భూముల జాబితాపై మంత్రి పొంగులేటి ప్రసంగం సరిగా లేదని సీఎం అసంతృప్తి
- నాలుగు గంటల సభా సమయం వృథా అయిందన్న అభిప్రాయం
- అంశంపై తానే స్వయంగా రంగంలోకి దిగాలని సీఎం నిర్ణయం
- అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా
మంత్రి సమాధానంతో సభలో నాలుగు గంటల విలువైన సమయం వృథా అయిందని, 22ఏ అంశంపై స్పష్టత ఇవ్వడంలో మంత్రి విఫలమయ్యారన్న అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కీలక అంశంపై తానే స్వయంగా రంగంలోకి దిగి సభలో సమగ్ర సమాధానం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సమావేశాలను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. 22ఏ నిషేధిత భూముల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో, ప్రభుత్వం ఈ అంశంపై మరింత సన్నద్ధమై సభలో సమాధానమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
