తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను 'ప్రజాపాలన దినోత్సవం'గా గురువారం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
తరతరాల అణచివేత, దోపిడీ విధానాలపై ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపించిన చారిత్రక గడ్డ తెలంగాణ అని సీఎం అభివర్ణించారు. సమ్మక్క-సారలమ్మల కాలం నుంచి సాయుధ రైతాంగ పోరాటం వరకు అన్యాయాలను ఎదిరించడమే ఈ ప్రాంతపు నైజమని, ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
భూ పరిపాలనలో సంస్కరణల కోసం భూ భారతి చట్టం తీసుకొచ్చినట్టు, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 5.94 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసినట్టు, మరో 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు.
