శాసన పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం శాసనమండలి (లెజిస్లేచర్) షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ మరియు మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమ కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ హాజరయ్యారు.

ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుతో పాటు సభ్యులు డాక్టర్ మురళీ నాయక్, రాందాస్ మాలోతు, కోవా లక్ష్మీ, అనీల్ జాదవ్, తెల్లం వెంకట్రావు, శ్రీపాల్ రెడ్డి పింగళి హాజరయ్యారు. బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో పాటు సభ్యులు ఆర్. భూపతి రెడ్డి, చింతా ప్రభాకర్, శ్రీ గణేష్, రామారావు పవార్, యల్ రమణ, తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చిట్టెం పర్ణికా రెడ్డితో పాటు సభ్యులు మట్టా రాగమయి, కోవా లక్ష్మీ, వాణీ దేవి పాల్గొన్నారు.

శాసన పరిషత్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి కూడా హాజరయ్యారు. ముందుగా నూతన కమిటీ చైర్మన్లకు, సభ్యులకు చైర్మన్, స్పీకర్‌లు, కార్యదర్శులు పుష్ప గుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, శాసన వ్యవస్థలో కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సిఫారసులు చేయడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ తెగల వారికి సబ్సిడీ పథకాలు అమలు కాక లబ్ధిదారులు నేటికీ సబ్సిడీ పేపర్లను పట్టుకొని తిరుగుతున్నారని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ చైర్మన్, సభ్యులపైన ఉందని పేర్కొన్నారు.

గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కార మార్గాలను సూచించాలని ఆయన కోరారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, లెజిస్లేటివ్ కమిటీలు ప్రభుత్వం మరియు ప్రజల మధ్య ఒక ముఖ్యమైన వారధిగా పని చేయాలని, తద్వారా పథకాల అమలులో ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ప్రజలకు పథకాలు మరింతగా చేరువయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10.45 శాతం మంది ఉన్న షెడ్యూల్డ్ తెగల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించడం, లోటుపాట్లను గుర్తించి సమగ్ర అభివృద్ధికి అవసరమైన సూచనలను ప్రభుత్వానికి అందించడం షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ ప్రధాన కర్తవ్యమని తెలిపారు.

సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి అనే ఆదర్శాల పట్ల సమిష్టి నిబద్ధతకు వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ ప్రతీక అని స్పీకర్ పేర్కొన్నారు. మహిళల భద్రత, ఆర్థిక సాధికారతకు సంబంధించిన పథకాలు, శిశు సంక్షేమ సంస్థలు, అంగన్‌వాడీల పనితీరు, దివ్యాంగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వయోవృద్ధులకు జీవన పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

శాసన వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శాసనమండలి సంయుక్త కమిటీలు అత్యంత ప్రభావితమైనవని, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సంయుక్త కమిటీ సూచనలు, సలహాలు ఉపయోగపడతాయని అన్నారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.

జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల సాధికారత కోసం ఈ కమిటీ ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనవని, అదేవిధంగా శిశువులు, దివ్యాంగులు, వృద్ధుల రక్షణ, సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ రిపోర్టులు ఎంతో విలువైనవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.