హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు మనందరికీ ఎంతో భావోద్వేగమైన రోజని, పోలీస్ అమరులను స్మరించుకునే రోజని ఆయన అన్నారు.

సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు నివాళులు. దేశవ్యాప్తంగా దేవ్ సింగ్, ప్రమోద్ కుమార్, గాజుల సౌమ్య విధి నిర్వహణలో మరణించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను మరువలేం. అమరుల కుటుంబం ఒంటరి కాదు.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యం, అందుకే పోలీస్ శాఖకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీ

2027 లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించాం. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచాం.

గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్లకు రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా ఉండగా, దాన్ని ఏకంగా రూ.1 కోటికి పెంచాం. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు గతంలో రూ.45 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచాం. ఎస్ఐలకు రూ.45 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.50 లక్షలు ఉండగా, దీన్ని రూ.1.25 కోట్లకు పెంచాం. డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులకు రూ.50 లక్షలు ఉండగా, రూ.1.50 కోట్లకు పెంచాం.

ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు కోటి రూపాయల పరిహారం ఉండగా, దాన్ని రూ.2 కోట్లకు పెంచాం. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు.. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించి, హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలకు ఇందులో అవకాశం కల్పించాం.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఈ ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నా.

కాలంతో పాటు నేర స్వభావం మారుతోంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను ఆధునీకరించాలని నిర్ణయించాం; ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నాం. సాంకేతికత ఎంత పెరిగినా పోలీసుల మానవీయ దృక్పథం మారకూడదు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరం; యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలి. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీని అభినందిస్తున్నా.

కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపేందుకు టీజీ సేఫ్‌ను తీసుకొచ్చాం. షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాం. మహిళలకు అండగా నిలిచే సామాజిక బాధ్యతను పెంచడానికి ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించాం. మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ అందించడానికి ఏప్రిల్‌లో ‘స్పందన – తక్షణ రక్షణ బృందాలను’ ప్రారంభించాం.

మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదు. మహిళల భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి.

చివరిగా పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. మీ కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరు. కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదు.. మీకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు శాఖ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం అండగా ఉంటుంది.

ఈ రోజు పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీ క్రమశిక్షణే మీ బలం. మీ నిజాయితీయే మీ గౌరవం. ప్రజలకు మీరు అందించే భరోసాయే మీకు లభించే గొప్ప గుర్తింపు. ప్రజల భద్రతకు మీరు అండగా నిలవండి. మీ సంక్షేమానికి, మీ కుటుంబాల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరుల త్యాగాలను గౌరవిద్దాం. వారి ఆశయాలను కొనసాగిద్దాం. శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందాం.