హైదరాబాద్, అక్టోబర్ 10 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ మార్కెట్లో విద్యుత్ అందుబాటులో లేదని తెలిపారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ సంక్షోభంలా ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని, ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
