హైదరాబాద్ (బుద్ధ భవన్), అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ అంటే కేవలం ఆడవాళ్ల పండుగ మాత్రమే కాదని, ఇది కుటుంబ పండుగ అని చైర్‌పర్సన్ అన్నారు. గాంధీజీ చెప్పినట్లుగా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా వెళ్లగలిగే పరిస్థితులు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుగా భావించాలని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు పడే భయం వర్ణనాతీతమని అన్నారు.

తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో చనువు ఇస్తారని, కానీ ఆ చనువును దుర్వినియోగం చేసుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. "అవును", "కాదు" అనే మాటలను ఖరాఖండిగా చెప్పగలిగేలా విద్యార్థినులు ఉండాలని అన్నారు.

మహిళలు ఎలా ఉండాలో చెబుతున్నారు గానీ, మహిళలతో పురుషులు ఎలా మసలుకోవాలో ఎవరూ చెప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మహిళా కమిషన్ ఆ బాధ్యత తీసుకుంటుందని, పురుషులందరికీ మహిళలతో ఎలా ప్రవర్తించాలో తెలియజెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్క మహిళా సెల్ఫ్ డిఫెన్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీ, స్కూల్‌లో విద్యార్థులకు వారానికి రెండుసార్లు, కనీసం ఒక గంటపాటు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేలా చర్యలు తీసుకుంటామని నేరెళ్ళ శారద అన్నారు.