ఢిల్లీ, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే భర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అలా చేయకుంటే మోదీ తన గద్దెను ఖాళీ చేయాలని, లేకపోతే ప్రజలే ఆయనను గద్దె దించుతారని అన్నారు.

"ఓటు బచావో... దేశ్ బచావో" ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్ వద్ద నివాళుల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూటమి కోసమో కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమమని రేవంత్ రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు, 2024 నాటికి 97 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకున్నందున ఓటర్ల సంఖ్య మరింత పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, అవి ఎలా తగ్గిపోయాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి వారు ప్రాణాలకు తెగించి పోరాడి స్వాతంత్య్రం తెచ్చారని సీఎం అన్నారు. సంపన్నులు, పేదలు తేడా లేకుండా డాక్టర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని, ఇప్పటివరకు ఎన్నిసార్లు సర్ (ఎస్ఐఆర్) జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదని పేర్కొన్నారు.

ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు.

కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా రెండు వర్గాలుగా విభజిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరోవైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేష్ కుమార్ పరిస్థితులను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకొని వాటిని తొలగిస్తున్నారని సీఎం ఆరోపించారు.