ఢిల్లీ, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ – పుణె, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై కారిడార్లకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, కొన్ని మార్పులను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సీఎం తెలిపారు.

ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ ఆమోదించిన తర్వాత భూ సేకరణను ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా అలైన్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ రైలు భవన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కీలక రైలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు.

వికారాబాద్ – కృష్ణా కొత్త రైలు మార్గాన్ని (130 కి.మీ.) వెంటనే మంజూరు చేయాలని సీఎం కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీ సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయని, దీంతో ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కి.మీ మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పక్కనే రీజినల్ రింగ్ రైలును అలైన్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం కోరారు. రీజినల్ రింగు రైలుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

డోర్నకల్ – గద్వాల్, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ – జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్ – లాతూర్ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.) మార్గాలను వెంటనే మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీప అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ డిపో ఏర్పాటుకు అవసరమైన 409 ఎకరాల 1 గుంట భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు ఇప్పటికే అంగీకరించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.