సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించినట్టు ఆయన తెలిపారు.

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున 2027 డిసెంబరులోగా అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు.

అదనపు సేవలు అందించే ప్రభుత్వ వైద్యులకు ప్రోత్సాహకాలు ఇస్తామని, విద్య, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశాలుగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.