బోవెన్‌పల్లి, అక్టోబర్ 12 (ఎక్స్‌ప్రెస్ టుడే): భగవంత్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బోవెన్‌పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్‌కు స్థానికులు వినతిపత్రం అందజేశారు. కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత పేరుకుపోవడంతో పాటు పందికొక్కులు, పాముల బెడద తీవ్రంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పందికొక్కులు నేలను తవ్వేయడంతో అంగన్‌వాడీలోని బాత్రూమ్ సైతం నిరుపయోగంగా మారిందని, దీనివల్ల అక్కడికి వచ్చే చిన్నపిల్లలు, గర్భిణులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

దీనిపై డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని శానిటరీ సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, సి. విజయ్ కుమార్, టి. శ్రవణ్, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.