తిరుపతి, సెప్టెంబర్ 18: శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవను సెప్టెంబర్ 19న తిరుమలలో నిర్వహించనున్న నేపథ్యంలో, లక్షలాది మంది భక్తులు తిరుపతికి తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు, భక్తుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు

తిరుపతి నగరంలో భక్తులు, వాహనదారుల సౌలభ్యం కోసం ట్రాఫిక్ మళ్లింపులతో పాటు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తూ, భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు రావాలని సూచించారు. ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించి, అక్కడి నుంచి భక్తులు తిరుమలకు చేరేలా ఆర్టీసీ సహకారంతో ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలాలపై అవగాహన కోసం సోషల్ మీడియా ద్వారా, ఫ్లెక్సీల ద్వారా క్యూఆర్ కోడ్‌తో కూడిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు నిషేధం

గరుడ సేవ నాడు భక్తుల భద్రతను ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం, అంటే సెప్టెంబర్ 18న రాత్రి 9 గంటల నుంచి ఆదివారం, సెప్టెంబర్ 20న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పార్కింగ్ సదుపాయంతో పాటు 24x7 గంటల పాటు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్, అగ్నిమాపక సేవలు, ఇతర అత్యవసర వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు.

పార్కింగ్ ప్రదేశాల వివరాలు

ద్విచక్ర వాహనదారుల కోసం బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌లలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో వచ్చే టూరిస్టు బస్సుల కోసం జూ పార్క్ రోడ్డులోని దేవలోక్, ట్రైడెంట్, మ్యాంగో మార్కెట్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. నాలుగు చక్రాల వాహనాల కోసం భారతీయ విద్యాభవన్, అలిపిరి లింక్ బస్టాండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ అన్ని పార్కింగ్ స్థలాల వద్ద అవసరమైన ఏర్పాట్లతో పాటు తిరుమలకు చేర్చేలా టీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల సదుపాయం కల్పించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల మళ్లింపు

గరుడ సేవ రోజున తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను పోలీసులు ఈ కింది విధంగా మళ్లించనున్నారు. చిత్తూరు-మదనపల్లి వైపు నుంచి వచ్చే బస్సులను కాలూరు క్రాస్ మీదుగా ఆర్సీపురం జంక్షన్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లిస్తారు. చెన్నై, పుత్తూరు వైపు నుంచి వచ్చే బస్సులను సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లిస్తారు. కడప, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే బస్సులను రమణ విలాస్ జంక్షన్, గాజులమండ్యం సర్కిల్ మీదుగా సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లిస్తారు.

భక్తులకు పోలీసుల విజ్ఞప్తి

గరుడ వాహన సేవను దర్శించేందుకు తిరుపతికి వచ్చే భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపి, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. భక్తులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. భక్తుల భద్రతతో పాటు వాహనదారుల సౌలభ్యం కోసం అమలు చేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు, మళ్లింపులను పాటించి గరుడ సేవను విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.