తిరుపతి, సెప్టెంబర్ 8: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 13 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,30,000 జరిమానా విధించిన కోర్టు, ఒక వాహనదారుడికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష కూడా విధించింది.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల భద్రతను కాపాడే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

13 మంది వాహనదారులపై కేసులు, రూ.1.30 లక్షల జరిమానా

ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అనంతరం సంబంధిత వాహనదారులను గౌరవ 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ముందు హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి శ్రీమతి ధనలక్ష్మి గారు 13 మందికి జరిమానాలు విధించారు. 13 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,30,000 జరిమానా విధించబడింది.

ఒక వాహనదారుడికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష

వీరిలో ఒక వాహనదారుడికి కోర్టు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష కూడా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తితో తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ సర్వీస్ నిర్వహించారు.

మద్యం సేవించి వాహనం నడపొద్దు: పోలీసుల హెచ్చరిక

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

తిరుపతి నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన రహదారి ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని సూచించారు.