సైన్యం మహత్వాకాంక్ష ప్రాజెక్టు 'జొరావర్' తేలికపాటి యుద్ధ ట్యాంకుల తయారీ కాంట్రాక్టులో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది. దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం మూడేళ్ల పాటు సాంకేతిక, వాణిజ్య బిడ్లను మదింపు చేసిన అనంతరం రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పూర్తిగా ప్రైవేటు రంగం నిర్మించనున్న తొలి యుద్ధ ట్యాంకుగా జొరావర్ చరిత్ర సృష్టించనుంది. తదుపరి దశలో 130 వారాల్లోగా రెండు ప్రోటోటైప్ ట్యాంకులను అభివృద్ధి చేసి, ప్రదర్శించాల్సిన బాధ్యతను టీఏఎస్ఎల్‌కు అప్పగించనున్నారు.

ఎత్తైన ప్రాంతాలు, ఎడారి భూభాగాల్లో వేగంగా, సమర్థంగా మోహరించగల ఈ తేలికపాటి ట్యాంకులు సరిహద్దుల్లో సైన్యం కదలికల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రోటోటైప్ నిర్మాణానికి మహీంద్రా సంస్థ కూడా పోటీలో నిలవడం గమనార్హం.

దేశీయ రక్షణ తయారీ రంగానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది కీలక ముందడుగుగా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు.