శ్రీకాకుళం, సెప్టెంబర్ 28: విద్యార్థులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు ఉపయోగపడేలా పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ సూచించారు.

శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధిలోని నైర వ్యవసాయ కళాశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అసోసియేట్‌ డీన్‌ డాక్టర్ డి. చిన్నం నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ మాట్లాడారు. అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలు, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కళాశాలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాంగణ పరిశోధన/అనుభవ పూర్వక అభ్యసన విభాగానికి చెందిన వివిధ ప్రదర్శన స్టాళ్లను సందర్శించి విత్తనాలను కొనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ ఏ.వి. రమణ, డాక్టర్ ఏ. ఉపేంద్ర, డాక్టర్ గురుమూర్తి, డాక్టర్ ఎన్. సురేష్‌కుమార్, డాక్టర్ పి. సీతారామ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ ఎస్. గోవిందరావుతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.