సెప్టెంబర్ 21: పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధిపై ఎక్కడైనా ప్రజల ముందు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని అలికాం–బత్తిలి, జగన్నాధపురం–సరుబుజ్జిలి మధ్య రూ.13.46 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లతో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "కనెక్టివిటీతోనే అభివృద్ధి" అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోందన్నారు. సరుబుజ్జిలి రహదారి విమానాలు దిగే రన్‌వేలా అద్భుతంగా సిద్ధమైందని పేర్కొన్నారు. స్పష్టమైన కార్యాచరణతో సరుబుజ్జిలి మండలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను స్థానికంగా అమలు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గత 25 ఏళ్లలో కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే టీడీపీ అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఎవరు ఎంతకాలం అధికారంలో ఉన్నారు.. ఎవరు మంత్రులుగా పనిచేశారు అన్నది ప్రజలకు తెలుసన్నారు. ప్రెస్‌మీట్లలో హడావుడి చేసే నేతలు ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులు, తాగునీరు, సాగునీటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస ఎయిర్‌పోర్టు కూడా కార్యరూపం దాల్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేరడి బ్యారేజీ, రెండో కేంద్రీయ విద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతికి రైలు, రైల్వే జోన్ వంటి గతంలో అసాధ్యంగా భావించిన అనేక కార్యక్రమాలను సాకారం చేస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.