సెప్టెంబర్ 22: శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై మంగళవారం నాడు ఢిల్లీ నుంచి శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీతో ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి సూచించారు. వినాయక చవితి నిమజ్జనాల్లో సైతం అత్యంత అప్రమత్తత అవసరమని ప్రజలకు సూచించారు. తీరప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద, హోర్డింగ్స్ సమీపంలో ఉండకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సైతం సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని, ముందస్తు సన్నద్ధత, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం, సమాచారం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు అవసరమైన సందర్భాల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08942 240557 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి సూచించారు.