నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, దానిని మరింత విస్తృతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.వి.ఎన్. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించిన 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నేత్రదాన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ నేత్రదాన ప్రక్రియలో భాగస్వాములై నేత్రదానాన్ని విస్తృతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో అప్తాల్మిక్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్. పుష్పలత తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడంతో పాటు అవగాహన ర్యాలీలు చేపట్టి ప్రజల్లో నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించి చైతన్యం కల్పించినట్లు వివరించారు.
విజేతలకు బహుమతులు, అవగాహన ర్యాలీ
అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేసి, డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
