తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే దేశ ఆర్థికాభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి భారత్‌ను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా 31 శాతంగా ఉందని, 2047 నాటికి ఇది మరింత పెరుగుతుందని తెలిపారు.
కృష్ణపట్నం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను దక్షిణాది రాష్ట్రాలకు అందించాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై పెండింగ్‌లో ఉన్న అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సమావేశంలో తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం వి.డి. సతీశన్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
