రాయలసీమ దశ దిశ మార్చే హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. మదనపల్లెలో అక్టోబర్ 2వ తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వివిధ రూపాల్లో ఇవ్వనుంది. వీటికి తోడు మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రానున్నాయి. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషితో, కేంద్రంతో సమన్వయంతో ఈ ప్రాజెక్టును సాధించారు.
దీని ద్వారా కరువు పీడిత ప్రాంతాల్లో హార్టికల్చర్ రంగానికి ఊతం ఇచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్న ప్రభుత్వం... మరోవైపు హార్టికల్చర్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆ ప్రాంతాల్లో సంపద పెరిగేందుకు, రైతులు లబ్ది పొందేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
మదనపల్లెలో జరిగే ఈ కార్యక్రమంతో పాటు 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయం రంగంలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు అయ్యే ఈ అగ్రికల్చర్ స్కూల్‌ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది.
ఇదే నెలలో సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 29వ తేదీన పల్లె పండుగ, 30వ తేదీన విజయవాడలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ విధంగా ఐదు రోజుల పాటు వరుస కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
