శ్రీకాకుళం, ఆగస్టు 21: పెద్దపాడు డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం. నాయక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్లు సందర్శించారు.
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి విద్యాభ్యాసం, సౌకర్యాలు, పాఠశాల కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం ఏటీఎల్ ల్యాబ్‌ను సందర్శించి, విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలపై పరిశీలించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా మాట్లాడి, విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా విధానాలు, పాఠశాల ఫలితాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులలో విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు, మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమిష్టి కృషి చేయాలని పలు విలువైన సూచనలు చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ప్రతిభను వెలికితీసేలా ప్రోత్సాహం అందించాలని అధికారులు ఆదేశించారు.
