రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ఆనాడు ధైర్యంగా నిలబడ్డ జనసేన శ్రేణులు ఈసారి మరింత బలంగా బరిలో నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో బలాబలాలను సమీక్షించి, పోటీ చేయదగ్గ స్థానాలను గుర్తించాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, పార్టీ శ్రేణుల బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
