న్యూఢిల్లీ, అక్టోబర్ 27 (ఎక్స్‌ప్రెస్ టుడే): మందుల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)కు, రిటైలర్లు కొనుగోలు చేసే ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ కళ్లెదుటే ఇది జరుగుతోందని, అయినా అనుమతిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మందుల ధరలను నియంత్రించాల్సిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) పూర్తిగా పనిచేయని సంస్థలా కనిపిస్తోందని కూడా ధర్మాసనం పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. విచారణ సందర్భంగా భారతదేశంలో మందుల ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిల్లో ఉన్నాయని కేంద్రం వాదించింది. అయితే ‘అత్యల్ప ధరల’ అంశంలోకి వెళ్లవద్దని, వెళ్తే తలసరి ఆదాయం వంటి ఇతర అంశాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు లైవ్‌లా తెలిపింది.
క్యాన్సర్ మందులపై నిర్ణయం
ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీగా మార్కప్ వసూలు చేయడాన్ని గతంలో సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో, క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌ను ఎంఆర్పీలో 30 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీనివల్ల రోగులకు ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల ఆదా అవుతుందని అంచనా వేసింది.