న్యూఢిల్లీ, అక్టోబర్ 26 (ఎక్స్ప్రెస్ టుడే): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుఫానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ప్రకటించింది. గత ఆరు గంటల్లో ఇది సుమారు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దాదాపు పడమర వైపు కదిలిందని తెలిపింది.
ఈ తుఫాను మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారి, అక్టోబర్ 28 ఉదయం యానాం సమీపంలో బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు 140 కిలోమీటర్ల వరకు గాలులు వీచవచ్చని పేర్కొంది.
భారీ వర్షాల హెచ్చరిక
తుఫాను ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో అక్టోబర్ 27–28 తేదీల్లో, ఒడిశాలో 28న, ఛత్తీస్గఢ్లో 28–29 తేదీల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని లోతట్టు తీర ప్రాంతాల్లో సముద్రం సాధారణ ఆటుపోట్ల స్థాయి కంటే సుమారు 1 నుంచి 1.5 మీటర్ల మేర ముందుకు రావచ్చని (స్టార్మ్ సర్జ్) అంచనా వేసింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, యానాం ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.