ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు కోల్పోతున్న వారు అజాగ్రత్తగా ఉండేవారో, చదువులేనివారో కాదని, ఐటీ ఉద్యోగులు, బ్యాంకర్లు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు కూడా బాధితులవుతున్నారని ఐఐటీ మద్రాస్ అధ్యయనం తేల్చింది.

ఐఐటీ మద్రాస్‌లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ సెప్టెంబరు 29న ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. కొందరు బాధితులకు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

ప్రొఫెసర్ పి. కందస్వామి (విశ్రాంత ఐపీఎస్ అధికారి), ప్రొఫెసర్ నందన్ సుదర్శనం, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ అకాంక్ష జైస్వాల్, లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన ప్రొఫెసర్ అమీతా ఫెర్నాండో బృందం ఐదు నగరాల్లో 33 మంది బాధితులను ఆంగ్లం, హిందీ, తమిళ భాషల్లో ఇంటర్వ్యూ చేసింది.

వీరిలో 22 మంది పురుషులు, 11 మంది మహిళలు కాగా 12 మంది సీనియర్ సిటిజన్లు. నష్టాలు కొన్ని వేల రూపాయల నుంచి రూ.1 కోటి పైగా ఉన్నాయి. అధ్యయనం ‘హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కమ్యూనికేషన్స్’ పత్రికలో ప్రచురితమైంది.

మోసగాళ్ల పద్ధతుల ఆధారంగా నిర్దిష్ట హెచ్చరికలు, బ్యాంకుల్లో వేగవంతమైన మోసం గుర్తింపు, బ్యాంకులు–పోలీసుల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని అధ్యయనం సిఫార్సు చేసింది.