మిల్వాకీ, అక్టోబర్ 1: ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల వాణిజ్య మంత్రులు అమెరికాలోని మిల్వాకీలో రెండు రోజుల చర్చలను ప్రారంభించారు. భారత్ తరఫున కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి ఉండటంపై సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లి, మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు న్యూఢిల్లీ, వాషింగ్టన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ భేటీ జరుగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతలు, పారిశ్రామిక విధానాలు, సరఫరా గొలుసుల వంటి అంశాల పరిష్కారానికి జీ20 ముఖ్య వేదికగా మారింది. ఈ ఏడాది చివర్లో అమెరికా ఆతిథ్యమివ్వనున్న జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ మంత్రుల స్థాయి చర్చలు జరుగుతున్నాయి.