న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) 'అవసర్ 2026' ఉద్యోగ, ఇంటర్న్‌షిప్ డ్రైవ్ రెండో విడతను అక్టోబర్ 7న నిర్వహించనుంది. ఇప్పటివరకు 4,000 మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు; 85కు పైగా సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది.
విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ కార్యాలయం పరిధిలోని సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ (సీపీసీ) ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నార్త్ క్యాంపస్ గేట్ నంబర్ 2 వద్ద ఉన్న మల్టీపర్పస్ హాల్లో నిర్వహిస్తుంది. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్ఓఎల్), నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు (ఎన్సీడబ్ల్యూఈబీ) విద్యార్థులు పాల్గొనవచ్చు. నమోదు రుసుము లేదు.
పాల్గొనే సంస్థల్లో స్ప్రిక్స్ జపాన్, టీచ్ ఫర్ ఇండియా, కోటక్ లైఫ్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ రూ.10 లక్షలకు పైగా ఉంటుందని, ఇంటర్న్‌షిప్‌లకు నెలకు రూ.60,000 వరకు స్టైపెండ్ లభిస్తుందని డీయూ తెలిపింది. విద్యార్థుల విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా సంస్థలు అవకాశాలు కల్పిస్తాయి.
విద్యార్థులు కంపెనీల ప్రెజెంటేషన్లు, ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లు, స్క్రీనింగ్ రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉంది. సీవీ ప్రతులను, గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని, ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలని సూచించారు. పాల్గొనే ముందు ఆయా సంస్థల అర్హతలు, ఉద్యోగ వివరాలు, వేతనం, ఎంపిక విధానాన్ని పరిశీలించుకోవాలని కోరారు. గతంలో 'జాబ్ మేళా' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 'అవసర్' పేరుతో నిర్వహిస్తున్నారు.