న్యూఢిల్లీ (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు శనివారం దేశ రాజధానిలో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేశారని రాయిటర్స్ తెలిపింది.
ఓటర్ల జాబితాల సవరణ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి అనుకూలంగా ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనిపై యువత నేతృత్వంలోని స్వీయ నామధేయ “కాక్రోచ్ జనతా పార్టీ” (సీజేపీ) వేలాది మందితో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు అధికారులు నిర్దేశించిన నిరసన స్థలం జంతర్ మంతర్ వద్ద గుమిగూడాలని నిరసనకారులు నిర్ణయించారు.
వేలాది మంది భద్రతా సిబ్బంది గస్తీ కాస్తుండగా, రవాణా, టెలికాం సదుపాయాలను నిలిపివేశారు. ఢిల్లీ పోలీసులు పదుల సంఖ్యలో నిరసనకారులను, పలువురు ప్రముఖ కార్యకర్తలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ పోలీసు వర్గం రాయిటర్స్‌కు తెలిపింది.
ఢిల్లీ వెలుపల నిర్బంధంలోకి తీసుకున్నవారిలో నిరసనకు మద్దతిస్తున్న ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఉన్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను ముంబై నుంచి వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో నిర్బంధించారని, నిరసనను విరమించుకోవాలని అధికారులు కోరారని పార్టీ తెలిపింది. పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా విమానం దిగగానే నిర్బంధించినట్టు ఉద్యమం ఒక ప్రకటనలో పేర్కొంది.
మెట్రో, మార్కెట్లు మూత
మెట్రో స్టేషన్లు, మార్కెట్లను మూసివేయడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేశారని రాయిటర్స్ ప్రతినిధులు తెలిపారు. నిరసనకారులు ఉన్నారేమోనని పోలీసులు బస్సుల్లోకి ఎక్కి, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలతో రాకపోకలను నిలిపివేశారు. కీలక మార్గాల్లో టియర్ గ్యాస్ గన్లు అమర్చిన అల్లర్ల నియంత్రణ వాహనాలను ఉంచారు.
నగరంలోని కేంద్ర వ్యాపార ప్రాంతంలో బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన కొందరు యువ నిరసనకారులను పోలీసులు వెంబడించి, వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్లిన దృశ్యాలను టెలివిజన్ చానళ్లు ప్రసారం చేశాయి.