న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం 20వ రోజ్‌గార్ మేళా సందర్భంగా 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన నియామక పత్రాలు అందుకునే వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది.

ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఒకేసారి జరుగుతుంది. కొత్తగా ఎంపికైన అభ్యర్థులు రెవెన్యూ విభాగం, రైల్వే శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ శాఖ వంటి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు.

20వ రోజ్‌గార్ మేళాతో కలిపి వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో నియామక పత్రాలు అందుకున్న యువత సంఖ్య మొత్తం సుమారు 12.75 లక్షలకు చేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వ నిరంతర దృష్టికి ఈ మేళా నిదర్శనమని పీఎంవో వివరించింది.

గత మేలో జరిగిన రోజ్‌గార్ మేళాలోనూ ప్రధాని 51 వేలకు పైగా నియామక పత్రాలు అందజేశారు.