కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతినబూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని తెలిపారు.
తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని, ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని వెల్లడించారు. కరిక్యులం మార్చామని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్లు, దొడ్డి సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని తెలిపారు.
నాలుగేళ్లు ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం రాని పరిస్థితి నుంచి, నాలుగు నెలల కోచింగ్‌తో నైపుణ్యాభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించే దిశగా పరిశ్రమలు-కాలేజీలను అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టం చేశామని, పోలవరం పూర్తికి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నిధులు ఇచ్చామని, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించారు.
